27, ఆగస్టు 2011, శనివారం
ఇది అన్నాహజారే విజయం కాదు..
Categories :
anna hazare . news . TOP
పార్లమెంటులో జన్ లోక్ పాల్ బిల్లు జయకేతనం ఎగరవేసింది. ఇంతవరకూ ఈ బిల్లుకు మోకాళ్లడ్డిన నేతలే, తలవంచాల్సి వచ్చింది. ఓటింగ్ లేదని కాసేపు, మూజువాటి ఓటింగ్ అంటూ మరికాసేపు.. ఈ బిల్లును తప్పించుకోవడానికి ప్రయత్నించిన రాజకీయనేతలు, సభలో చర్చ ప్రారంభమయ్యాక మనసు మార్చుకున్నారు. జనం కోరుతున్న బిల్లును ఆమోదించకపోతే, ఎవరూ క్షమించరన్న నిజం తెలుసుకున్నారో ఏమో.. అన్నా డిమాండ్లను ఆమోదిస్తూ ఏకంగా ఏకగ్రీవ తీర్మానమే చేశారు. చెప్పాలంటే.. పండు వయసులోనూ జాతిహితం కోరి పన్నెండురోజుల నిరాహారదీక్షతో అన్నా హజారే మనకు అందించిన అపూర్వ విజయం. ఇది మరో స్వాతంత్ర్యంతో సమానం. లోక్ పాల్ వ్యవస్థలో కీలకమైన మూడు డిమాండ్లను అంగీకరిస్తే తప్ప దీక్ష విరమించనంటూ పట్టుబట్టి, చివరివరకూ అదే మాటకు కట్టుబడి.. ప్రాణాలమీదకు వస్తున్నా చలించక పోరాడారు అన్నా హజారే. ఈ జాతి యావత్తూ ఆయనకు ఎంతో రుణపడిఉంది. అయితే.. ఇది అన్నా ఒక్కడి విజయమే కాదు. ఈ విజయానికి ఆయన కేంద్రబిందువే అయినప్పటికీ, ఆయన వెనుక నడిచిన యావత్ భారతానికి ఈ విజయంలో పాత్ర ఉంది. జనసంద్రం అన్నా వెంట తరలిఉండకపోతే, ప్రభుత్వం దిగివచ్చేది కాదేమో.. అంతేకాదు.. పోరాటాలంటే రోడ్డుపైకి ఎక్కి కాసేపు ధర్నాలు చేసి మీడియాకు ఫోజులిచ్చి వెళ్లిపోవడంగా మార్చేసిన మన రాజకీయనేతలకు బుద్ధి తెచ్చే పోరాటం. చేవచచ్చి, సర్కార్ ఏంచేసినా సర్దుకుపోతున్న జనంలో చైతన్యం తెచ్చిన పోరాటం. ఇంకా చెప్పాలంటే ఇది గాంధీగిరీ విజయం. గాంధీగిరీతో ఏదైనా సాధించొచ్చని మరోసారి నిరూపించారు నేటిగాంధీ అన్నా హజారే. అంతేకాదు, పాశ్చాత్య సంస్కృతిలో కొట్టుకుపోతున్న నేటి యువతకు, దేశభక్తి ఇంజెక్షన్ ను ఎక్కించారు. గాంధీ టోపీకి, మన జాతీయ పతాకానికి మరింత వన్నెతెచ్చారు. అందుకే.. ఇది జాతి విజయం.. అన్నా ద్వారా యావత్ జాతి సాధించిన విజయం. ఇప్పుడు యువతకు అన్నా మార్గదర్శి. అలాంటి అన్నా మనల్ని నడిపించాలి. మన దేశానికి, మన రాజకీయ వ్యవస్థకు, మన యువశక్తికి దిశానిర్దేశం చేయాలి. అవినీతి, అక్రమాలతో, రాజకీయకుళ్లుతో మలినమైన మనదేశాన్ని శుద్ధి చేయాలి. స్వేచ్ఛా భారతాన్ని గాంధీ అందిస్తే.. స్వచ్ఛమైన భారతాన్ని మనకు అందించడానికి అన్నా తోడ్పడాలి.
అన్నా జిందాబాద్....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి