16, జులై 2011, శనివారం
బెజవాడ చుట్టూ తిరిగిన కాంగ్రెస్ చరిత్ర
ఎవరు అవునన్నా .. ఎవరు కాదన్నా కాంగ్రెస్ చరిత్రకు విజయవాడకు విడదీయలేనంత సంబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం విజయవాడే. కాంగ్రెస్ ప్రస్తుతం వాడుతున్న జెండా నమూనా తయారయ్యింది.. మహాత్మా గాంధీ ఆమోదం పొందింది విజయవాడలోనే. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణపతాకాన్ని కొద్ది పాటి మార్పులతో కాంగ్రెస్ పార్టీ జెండాగా అంగీకరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ అదే జెండా కొనసాగుతోంది. మూడు రంగుల మధ్య అశోక చక్రం చేరి మన జాతీయ పతాకంగానూ మారింది. ఇదంతా అసలు కాంగ్రెస్ కథ. కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్నో చీలికలు పీలికలు అయ్యింది. చివరకు ఇందిరా కాంగ్రెస్ మాత్రమే నిలదొక్కుకోగలిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ గుర్తు హస్తానికి, జెండాలాగానే విజయవాడతోనే అనుబంధం ఉంది. వాస్తవానికి అసలు కాంగ్రెస్ కు ఆవు లేగదూడ గుర్తు ఉండేది. కానీ, ఇందిరా వేరు కుంపటి పెట్టుకోవడంతో, 1978 లో మరో ఎన్నికల గుర్తును ఎంచుకోవాల్సి వచ్చింది. కొత్త గుర్తును ఎంచుకునే విషయంలో ముగ్గురు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. వారెవరో కాదు... ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావు, బూటాసింగ్.
ఇందిరాగాంధీ విజయవాడ టూర్లో ఉన్నప్పుడు ఎన్నికల కమిష్ ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయానికి వర్తమానం పంపింది. ఏనుగు(హాతి), హస్తం (హాత్), సైకిల్ గుర్తుల్లో ఒకదాన్ని ఎంచుకోమని సూచించింది. బూటాసింగ్ ఎంతో ఆలోచించినా, ఇందిరకు చెప్పకుండా నిర్ణయం తీసుకోవాలనిపించలేదు. దీంతో, విజయవాడకు ట్రంక్ కాల్ బుక్ చేశాడు. అప్పట్లో లైన్లు క్లియర్ గా లేకపోవడం, బూటాసింగ్ హిందీ ఉచ్చరణ కాస్త వెరైటీగా ఉండడంతో ఆయన ఏం చెబుతున్నాడో ఇందిరకు అర్థం కాలేదు. హాత్ ను ఎంచుకుందామని బూటాసింగ్ అటువైపు నుంచి చెబుతున్నాడు. ఇందిరకు అది హాతి(ఏనుగు)గా వినిపించింది. ఇటు నుంచి ఈవిడ కాదు కాదు.. హాత్ ఎంచుకుందామని చెప్పింది. ఇందిర చెప్పేది బూటాసింగ్ కు అర్థం కావడం లేదు. ఆ సమయంలో ఇందిర పక్కనే పీవీ నర్సింహారావు ఉన్నారు. వెంటనే ఫోన్ ను అందుకుని.. గట్టిగా అరిచారు. బూటాసింగ్ జీ.. పంజా అని చెప్పండి అన్నారు. అప్పుడు ఇందిర కూడా వెంటనే ఆ.. పంజా పంజా.. అనేసింది. అటు బూటాకూ మ్యాటర్ అర్థమైపోయింది. హస్తంపై ఆమోద ముద్ర పడిపోయింది. కాంగ్రెస్ జెండా తయారైనట్లే.. ఆ పార్టీ ఎన్నికల గుర్తు ఇలా విజయవాడలోనే ఎంపికయ్యింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి