14, జులై 2011, గురువారం
చిరంజీవికి ఛాన్సుందా?
Categories :
chirnajeevi . POLITICS . TOP
కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి అందుతుందన్నది చిరంజీవి ఆశ. దీనికి సంబంధించి సోనియాతో చర్చల్లోనే ఆయనకు హామీ లభించింది. ఆ మేరకే పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తాజా మంత్రి వర్గవిస్తరణలో మంత్రి పదవి దొరుకుతుందని చిరంజీవి ఆశపడ్డా, వాటిపై హైదరాబాద్ టూర్లోనే నీళ్లు జల్లారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఆజాద్. మరో ఏడాది దాకా వెయిట్ చేయాల్సిందేనని స్సష్టం చేశారు. దీంతో చిరంజీవి నిరాశపడ్డారన్నది వాస్తవం. అయితే, ఇదే చివరి విస్తరణ అంటూ ప్రధాని మన్మోహన్ చేసిన ప్రకటన అందరిలోనూ గుబులు రేపుతోంది. డీఎంకే కోసమే రెండు ఖాళీలు ఉంచామని స్పష్టంగా చెప్పిన మన్మోహన్, చిరంజీవి విషయాన్ని మాటమాత్రమైనా చెప్పలేదు. అందుకే, చిరంజీవికి మంత్రి పదవి ఎంతవరకూ దక్కొచ్చన్నది అనుమానంగానే ఉంది. కానీ, ఓ అవకాశం మాత్రం ఉంది.
లోక్ సభ సభ్యుల్లో 15 శాతం మందిని మంత్రులుగా నియమించవచ్చు.అంటే, 81 మంది మంత్రులుగా విధులు నిర్వహించే అవకాశాన్ని రాజ్యాగం కల్పిస్తోంది. తాజా విస్తరణతో మంత్రుల సంఖ్య 78కి చేరింది. ఇంకా మూడు ఖాళీలున్నాయి. ప్రధాని చెప్పినట్లు రెండు డీఎంకేకు అనుకున్నా, మిగిలిన ఒకటీ చిరంజీవికే కావచ్చన్నది రాజకీయ పండితుల అంచనా. ఇది ఓ రకంగా చిరంజీవికి శుభ సంకేతమే. కాకపోతే, చిరంజీవికి ఇప్పటికిప్పుడు మంత్రిపదవి మాత్రం దక్కకపోవచ్చు. అందుకూ కొన్ని కారణాలున్నాయి. ప్రస్తుతం చిరంజీవి పార్లమెంటు సభ్యుడు కాదు. మంత్రి కావాలంటే ఉభయ సభల్లో దేనిలోనైనా సభ్యత్వం ఉండాలి. లేదంటే, మంత్రిగా ఎన్నికైన తర్వాత ఆర్నెళ్లలోపు పార్లమెంటు సభ్యత్వాన్ని సాధించాలి. లోక్‌సభకు ఎన్నికలు లేవు. రాజ్యసభకు ఎంపిక చేయాలంటే, సీట్లు ఖాళీ కావాలి. అవి వచ్చే ఏడాదికి గానీ సాధ్యం కాదు. రాష్ట్రం నుంచి ఏదో ఓ రాజ్యసభ సీటు ఖాళీ అయితే తప్ప చిరంజీవికి ఎన్నికయ్యే అవకాశం రాదు. అంతేకాదు, చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తే, తిరుపతి అసెంబ్లీ సీటు ఖాళీ అవుతుంది. నిబంధనల ప్రకారం ఆర్నెళ్లలో ఆ స్థానానికీ ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పటికే కడపదెబ్బతో ఖంగుతిని ఉన్న కాంగ్రెస్, తిరుపతి విషయంలో ఎన్నికలకు వెళ్లాలనుకోవడం లేదు. అక్కడా జగన్ ప్రభావం ఎక్కువగానే ఉండొచ్చు. పైగా, చిరంజీవంటే స్థానికంగా వ్యతిరేకత కూడా ఉంది. అందుకే, అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే చిరంజీవికి మంత్రి పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడైతే పెద్దగా ఇబ్బందులూ ఉండవు. పైగా చిరంజీవికి మంత్రి పదవి ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నట్లూ ఉంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి