3, జులై 2011, ఆదివారం
రాజీ లేదు.. రాజీనామాలే..
అధిష్టానం ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని చాటిచెప్పారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, అధిష్టానం దూతలు జరిపిన చర్చలకు లొంగమని తేల్చేశారు. తెలంగాణ విషయంలో రాజీ పడేదే లేదని, సోమవారం ఉదయం రాజీనామాలు ఇవ్వడమే ఖాయమని ప్రకటించేశారు. ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఉదయం 11 గంటలకు రాజీనామాలివ్వడానికి ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మంత్రులు, డిప్యూటీ సీఎం, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం రాజీనామాలకు దూరంగా ఉంటున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు వీరితో పాటే ఉండే అవకాశం ఉంది. కానీ, మిగిలిన మంత్రులంతా రాజీనామాలు చేస్తే మాత్రం రాజకీయ సంక్షోభం తలెత్తడం ఖాయం. అందుకే, పరిస్థితిని చక్కదిద్దడానికి సోనియా రంగంలోకి దిగారు. ఆదివారం మధ్యాహ్నమే ప్రణబ్ ముఖర్జీ, ఆజాద్, అహ్మద్ పటేల్ తో సమావేశమయ్యారు. అంతేకాదు.. జులై 5న ఢిల్లీకి వెళ్లి సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తామని ప్రకటించిన సీమాంధ్రనేతలనూ కట్టడి చేశారు. పదిమంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ టూర్ కు వెళుతున్నామని మంత్రి టీజీ వెంకటేష్ ప్రకటించిన కొద్దిసేపట్లోనే, రద్దయ్యిందంటూ ఆయన నోటితోనే చెప్పించారు. అధిష్టానవర్గం ఫోన్ చేసి తమ వాదాన్ని వింటామని హామీ ఇచ్చినందుకే టూర్ రద్దు చేసుకున్నామని వెంకటేష్ తెలిపారు.
కాంగ్రెస్ వేగంగా అడుగులు వేయడం చూసిన తెలుగుదేశం తాను కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించింది. అయితే.. కాంగ్రెస్ నేతలు ఏ సమయంలో వెనకడుగు వేస్తారో అన్న భయంతో ఉన్న టీడీపీ నేతలు.. కాంగ్రెస్ నేతలు రాజీనామాలు ఇచ్చిన తర్వాతే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌కు బద్ధవిరోధులైనా.. వారి వెనుకే నడవాలని తీర్మానించుకున్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ టీడీపీ నేతలు ప్రకటించడమూ హాస్యాస్పదంగానే కనిపిస్తోంది.
రాజీనామాలు షురూ..
టీడీపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని సాగిస్తున్న నాగం అండ్ పార్టీ అందరికన్నా ముందుగా రాజీనామాలను సమర్పించింది. నాగంతో పాటే, టీడీపీ ఎమ్మెల్యేలు హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, వేణుగోపాలచారిలు రాజీనామాలను సమర్పించారు. తెలంగాణ సాధన కోసం నాగం నిర్వహిస్తున్న ఏకతా దీక్షలోనే రాజీనామా పత్రాలను ప్రదర్శించారు. మాకుమ్మడి రాజీనామాలతో తెలంగాణ వచ్చేస్తుందా.?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి