8, జూన్ 2011, బుధవారం
'A 'ఎవరి కోసం?
Categories :
ఫ్యాన్స్ వెయింటింగ్‌కు తెరపడబోతోంది. టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ ఫిల్మ్ బద్రీనాథ్ థియేటర్లకు పరుగులు పెడుతోంది. మెగాఫ్యాన్స్కు ఇదో పండగ. మగధీర తర్వాత అదే స్థాయిలో రాబోతున్న మరో సినిమా బద్రీనాథ్. కానీ, ఫ్యాన్స్.. మీకు ఆ సినిమా చూసే అవకాశం లేదు..? ముఖ్యంగా కాలేజ్ కుర్రాళ్లకే టికెట్లు అమ్మకపోవచ్చు.. కారణం తెలుసా..?
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడంతా బద్రీనాథ్ హడావిడి. టైటిల్.. ట్రయలర్.. హీరో అల్లు అర్జున్ గెటప్.. అన్నీ కలగలిపి.. ఈ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని పెంచేశాయి. పరమపవిత్రమైన బద్రీనాథ్ క్షేత్రం బ్యాక్‌గ్రౌండ్‌గా ఈ సినిమా తెరకెక్కింది. భక్తి, ప్రేమ, యాక్షన్ అన్నీ కలగలిపిన సినిమా అంటున్నాడు బద్రీనాథ్ డైరెక్టర్ వి.వి.వినాయక్. యాక్షన్ మూవీస్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను క్రియేట్ చేసుకున్న వినాయక్.. ఇప్పుడు బన్నీని కొత్తకోణంలో చూపించబోతున్నాడు. లవర్‌బాయ్‌గా, బద్రీనాథ్ క్షేత్రపాలకుడిగానూ అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. క్యారెక్టర్ వేరియేషన్ కోసం గెటప్‌ను కూడా మార్చేశాడు. మగధీరను మించిన కత్తివిన్యాసాలు... యుద్ధపోరాటాలు బద్రీనాథ్‌లో కనిపించనున్నాయి. దీనికోసం వియత్నాంలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు అల్లువారబ్బాయి.
ఈనెల పదో తేదీన బద్రీనాథ్ రిలీజ్ అవుతోంది. మెగా ఫ్యామిలీ సినిమాలంటే చెవికోసుకునే ఫ్యాన్స్‌కు ఇది శుభవార్తే. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడొచ్చని సినిమా యూనిట్ చెబుతుంటే... సెన్సార్ బోర్డ్ మాత్రం పెద్దవాళ్లకు మాత్రమే అంటూ A సర్టిఫికెట్‌ను ఇచ్చింది. అంటే.. పద్దెనిమిదేళ్ల లోపున్న వారెవరూ ఈ సినిమా చూడకూడదన్నమాట. అంత ఘోరంగా ఈ సినిమా ఉంటుందా..? నిబంధనల ప్రకారమైతే.. ఈ సినిమా టికెట్లను పెద్దవాళ్లకు మాత్రమే అమ్మాలి. కానీ, మెగా ఫ్యాన్స్‌లో ఎక్కువమంది కుర్రాళ్లే. కాలేజ్ స్టూడెంట్సే. ఫస్ట్‌డే ఫస్ట్ షో చూడాలని ఎగబడేవారిలో సగానికి సగం మంది పద్దెనిమిదేళ్ల లోపు వారే. మరి వీరెవరూ సినిమా చూడకూడదంటే.. ఆగుతారా..?
A పై హీరోల మోజు
ఎన్టీఆర్ - అశ్వినీదత్ కాంబినేషనల్లో... భారీ బడ్జెట్‌తో.. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శక్తి. సోషియో ఫాంటసీ కథాంశంగా రూపొందింది. అయితే.. కొన్ని సన్నివేశాల కారణంగా.. సెన్సార్ బోర్డ్.. పెద్దవాళ్లకు మాత్రమే అని A సర్టిఫికెట్ ఇచ్చింది..
మాస్‌రాజా రవితేజ తాజా చిత్రం వీర కూడా సెన్సార్ ఇబ్బందుల్లో పడింది. వీరకు.. U/A సర్టిఫికెట్‌ను ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాపై మరో వివాదం చెలరేగింది. సెన్సార్ కట్ చేసిన దృశ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలో ప్రదర్శించకూడదు. కానీ ఈ నిబంధనను వీర నిర్మాతలు ఉల్లంఘించారు. హైదరాబాద్‌లో ఇలా ప్రదర్శిస్తున్న ప్రింట్‌ను సెన్సార్ బోర్డ్ సీజ్ చేయాల్సి వచ్చింది. వీర సంఘటనతో.. సెన్సార్ నిబంధలను నిర్మాతలను యధేచ్చగా ఉల్లంఘింస్తున్నారన్న విషయం బయటపడింది.
బాలకృష్ణకు చాలాకాలం తర్వాత సూపర్‌హిట్ ఇచ్చిన చిత్రం సింహా. ఇందులో హింస ఎక్కువవడంతో.. చాలా సన్నివేశాలను సెన్సార్ బోర్డ్ కట్ చేసింది. అప్పటికీ సింహా కాస్త హింసాత్మకంగానే ఉంటుంది. ఈ సినిమానూ పెద్దలకు మాత్రమే పరిమితం చేసింది సెన్సార్ బోర్డ్. A సర్టిఫికెట్‌నే ఇచ్చింది. సొసైటీకి మెసేజ్ ఇవ్వడం కోసం పవన్ కళ్యాణ్ మూడున్నరేళ్లు కష్టపడి తీసిన కొమరం పులి కూడా ఇదే అకౌంట్లో చేరింది. స్టోరీలైన్ బాగున్నా, పిక్చరైజేషన్ చేసిన దాన్ని బట్టి.. A సర్టిఫికెట్‌నే సెన్సార్ బోర్డ్ ప్రసాదించింది.
పోకిరి నుంచి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు రూట్ మార్చాడు. తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన పోకిరికి A సర్టిఫికెట్ దక్కింది. మహేశ్ నటించిన తాజా చిత్రం ఖలేజాదీ అదే బాట. అయితే.. కాస్తలో బయటపడి U/A సర్టిఫికెట్‌ను దక్కించుకొంది.
ఇలా చెప్పుకుంటూ వెళితే.. పెద్దహీరోల సినిమాలన్నీ A కు.. U/Aకు మధ్యే తిరుగుతున్నాయి తప్ప.. కుటుంబసమేతంగా చూడగలిగే U సర్టిఫికెట్ సినిమాలు మాత్రం రావడం లేదు. ఇది హీరోల లోపమా..? ఇండస్ట్రీ లోపమా..? లేక.. ప్రేక్షకుల్లో లోపమా..?
సెన్సార్ విధానాలు
సినిమా రిలీజ్లో మెయిన్‌రోల్ సెన్సార్ బోర్డ్దే. సినిమాలో ఏ సీన్లు ఉండాలి.. ఏ సీన్లు తీసేయాలన్నది డిసైడ్ చేసేది సెన్సార్ బోర్డ్ మెంబర్లే. అశ్లీలంగా, అసభ్యంగా ఉన్న దృశ్యాలను తొలగించాల్సిన బాధ్యత కూడా వీరిదే. కథ కోసం అంటూ డైరెక్టర్లు తీసిన ప్రతీసీన్నూ ఒకటికి పదిసార్లు పరిశీలించాల్సింది కూడా సెన్సార్‌బోర్డ్ సభ్యులే. ప్రేక్షకులు చూడడానికి అనువుగా ఉందనుకున్నప్పుడే.. బోర్డ్ సర్ఠిఫికెట్ మంజూరు చేస్తుంది. అప్పుడే థియేటర్లలో ప్రదర్శించడానికి వీలవుతుంది.
సినిమాలను బట్టి.. సినిమాల్లోని సన్నివేశాలను బట్టి... నాలుగు రకాల సర్టిఫికెట్లను సెన్సార్ బోర్డ్ ఇస్తుంది. అందులో మొదటిది U సర్టిఫికెట్. ఎలాంటి అశ్లీల దృశ్యాలు, ఎలాంటి హింసాత్మక సన్నివేశాలు ఈ సినిమాల్లో ఉండవు. ఆ తర్వాత ఇచ్చేది U/A సర్టిఫికెట్. హింసాత్మక దృశ్యాలు, ఎక్స్పోజింగ్ ఉన్నా ఓ పరిమితి వరకూ అనుమతి ఉంటుంది. పెద్దల పర్యవేక్షణలో పిల్లలు ఈ సినిమాను చూడొచ్చు. అయితే.. 12 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలు ఈ సినిమా చూడడానికి వీల్లేదు. ఆ తర్వాత కేటగిరి A సర్టిఫికెట్. ఈ తరహా అశ్లీలం, హింస పాళ్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. పెద్దలకు మాత్రమే చూడాల్సిన సినిమాలివి. 18 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్లు A సర్టిఫికెట్ సినిమా చూడకూడదు. ఆ తర్వాత S సర్టిఫికెట్. స్పెషల్ పర్సన్స్ మాత్రమే చూడగలిగే సినిమాలివి. డాక్టర్లు, ఇతర ప్రొఫెషనల్స్ చూడాల్సిన సినిమాలకు ఈ సర్టిఫికెట్‌ను ఇస్తారు.
వాస్తవానికి సినిమాను ప్రదర్శించే థియేటర్లో సెన్సార్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలి. సర్టిఫికెట్ వెనుకుండే కట్స్నూ అందరికీ కనిపించేలా ఉంచాలి. కానీ, చాలాచోట్ల సెన్సార్ సర్టిఫికెట్‌ను థియేటర్లలో ఉంచరు. కొన్ని చోట్ల ఫ్రంట్ కాపీని మాత్రమే నోటీస్ బోర్డుల్లో ఉంచుతారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు, టాప్ హీరోల సినిమాలన్నీ ఎక్కువగా A సర్టిఫికెట్‌తోనే వస్తున్నాయి. ఈ సర్టిఫికెట్‌ను అందరికీ కనిపించేలా అతికించడంతో పాటు.. 18 ఏళ్ల లోపు వారు సినిమా చూడడానికి వీల్లేదని కూడా స్పష్టంగా ప్రకటించాలి. అలాంటి వారికి టికెట్లు అమ్మడం నేరం. థియేటర్లోకి పంపించడమూ నేరమే. కానీ, మన దగ్గర మాత్రం వీటిని పాటించే థియేటర్లే కనిపించవు. చిన్న చిన్న పిల్లలతో వచ్చిన వారినీ A సర్టిఫికెట్ సినిమాను చూడడానికి అనుమతిస్తుంటాయి. దీన్నే ఇప్పుడు కంట్రోల్ చేయాల్సి ఉంది.
నిబంధనల ప్రకారం కనీసం 21 రోజుల ముందు సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిర్మాతలు దరఖాస్తు చేసుకోవాలి. సెన్సార్ సభ్యులు సినిమాను పూర్తిగా చూసిన తర్వాత, అందులో మార్పులు చేర్పులూ సూచించాల్సి ఉంటుంది. వాటిని తీసివేసిన తర్వాతే థియేటర్లో ప్రదర్శించాలి. కానీ, చాలామంది నిర్మాతలు మాత్రం రిలీజ్‌కు రెండు మూడు రోజుల ముందు సెన్సార్ ఆఫీస్‌కు వచ్చి హడావిడి చేస్తుంటారు. మరికొంతమంది ముందే ప్రింట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత సెన్సార్‌కు వెళతారు. దీనివల్ల సెన్సార్ చెప్పిన కట్స్ అమల్లోకి రావడం లేదు. ఈ పద్దతిలోనే ఇప్పుడు మార్పు రావాలి.
తెలుగు సినిమాలో హీరోయిన్‌తో అంగాంగప్రదర్శన చేయడం ఇటీవల కామన్ అయిపోయింది. రోజురోజుకూ హీరోయిన్ కట్టుకునే డ్రస్సుల్లో పొదుపు ఎక్కువైపోతోంది. డబుల్ మీనింగ్ డైలాగ్‌లూ, అసభ్య సన్నివేశాలు పెరిగిపోతున్నాయి. అయినా.. చాలా సినిమాలకు U సర్టిఫికెట్ అందుతోంది. హీరోయిన్ బొడ్డును చూపించినా, ఎదసొంపులను చూపించినా A సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే. లేదంటే, సీన్లను కట్ చేయాలి. ఈ విషయంలో సెన్సార్ బోర్డ్ కూడా సీరియస్‌గా రెస్పాండ్ కావాలి. సెన్సార్ నిబంధనలను మరింత పకడ్బందీగా అమలు చేయాలి.
నిబంధనల ఉల్లంఘన
తెలుగు సినిమాలో హీరోయిన్ రెచ్చిపోతుంది. ఏ మాత్రం సిగ్గుపడకుండా ఒంపు సొంపులు ప్రదర్శిస్తుంది. హీరో కూడా తక్కువేమీ తినలేదు. ఒక్క దెబ్బ కొడితే విలన్ ముక్కులోనుంచి రక్తం కారుతుంది. హీరో కత్తి పట్టాడంటే.. అవతల పది తలకాయలైనా తెగిపడాల్సిందే. సెన్సార్ నిబంధనలు కరెక్టుగా అమలైతే ఇవేవీ వెండితెరపై కనిపించవు. ఈ సీన్లు రెచ్చగొట్టేలా, గగుడ్పొడిచేలా ఉన్నా.. ఎవరూ పట్టించుకోరు. వీటికి అడ్డుపడాల్సిన సెన్సార్ బోర్డ్ కూడా లైట్ తీసుకుంటుంది. విమర్శలు రాకూడదు కాబట్టి A సర్టిఫికెట్‌ను ఇచ్చేస్తుంది. కానీ, థియేటర్ల దగ్గరకు వచ్చేసరికి, A సర్టిఫికెట్ సినిమా, U సర్టిఫికెట్ సినిమా ప్రదర్శనల్లో ఏమాత్రం తేడా ఉండదు. పైగా, సెన్సార్ నిబంధనలను ఎవరికి వారు తమకు నచ్చినట్లు మార్చుకుంటారు. మన ఇండస్ట్రీలో నిర్మాతలే.. ఎగ్జిబిటర్లు కాబట్టి.. A సర్టిఫికెట్ సినిమా చూడడానికి పిల్లలను అనుమతించకూడదన్న నిబంధనను తుంగలో తొక్కేస్తున్నారు. 18 ఏళ్ల లోపు పిల్లలు వచ్చినా టికెట్లు అమ్మేస్తారు.
ప్రాంతీయ సెన్సార్ బోర్డులు ఒక్కోటి ఒక్కోలా సర్టిఫికెట్లు ఇస్తుండడమూ వివాదమవుతోంది. హిందీ సినిమాల్లో వయెలెన్స్‌కు, రొమాన్స్‌కు కట్స్ చాలా తక్కువ. లిప్ టు లిప్ కిస్ పెట్టినా కట్ చేయరు. హిందీ సినిమా స్ట్లైల్లోనే తయారవుతున్న తెలుగు సినిమాలూ అలాంటి మినహాయింపులనే కోరుకుంటున్నాయి. అయితే.. ఇటీవల హైదరాబాద్ సెన్సార్ బోర్డ్ పనితీరులో చాలా మార్పు వచ్చింది. శృతిమించిన శృంగారానికి ఏమాత్రం ఒప్పుకునేది లేదంటున్నారు సెన్సార్ అధికారులు. పైగా, సెన్సార్ నిబంధనల్లో కీలకమైన మార్పులను కూడా త్వరలోనే తెస్తామంటున్నారు. A సినిమాల విషయంలో నిబంధనల ఉల్లంఘన యధేచ్చగా సాగుతుండడంతో.. 12 నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలు సినిమాలు చూడడం కోసం ప్రత్యేకంగా కొత్త కేటగిరీలను సృష్టించాలనుకుంటున్నారు. అయితే.. హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ ఆఫీసర్‌గా ధనలక్ష్మి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. ఇకపై లిప్‌కిస్‌లకు అనుమతించేదే లేదని ఆవిడ చెబుతున్నారు. అంటే.. బాలీవుడ్ హీరోల్లా తెలుగు హీరోలు ఇక రొమాన్స్ చేయలేరన్నమాట.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి