2, మే 2011, సోమవారం
లాడెన్ చచ్చెన్
Categories :
అమెరికన్లకు కొత్త పండుగ. తీవ్రవాదాన్ని వ్యతిరేకించే వర్గాలకు తీపివార్త. టెర్రరిస్టుల చేతుల్లో నష్టపోయిన కుటుంబాలకు ఇదో శుభవార్త. అదే ఒసామా బిన్ లాడెన్ మరణం. అగ్రరాజ్యం అమెరికాను దశాబ్దకాలంగా ముప్పుతిప్పలు పెడుతున్న లాడెన్.. ఎట్టకేలకు హతమయ్యాడు. కానీ, అమెరికా తీవ్రవాదంపై నిజంగానే విజయం సాధించిందా? ఘనంగా చెప్పుకోవాల్సిన విజయమేనా?
ప్రపంచ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ హతమయ్యాడు. అమెరికా సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలకు ప్రమాదకరంగా మారిన లాడెన్ ఇక లేడు.
ఛాందసవాదంతో ఎంతోమంది పెడదోవపట్టించిన కరుడుగట్టిన తీవ్రవాది లాడెన్ మరణించాడు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, దేశదేశాల్లో విధ్వంసాలు సృష్టించిన లాడెన్‌కు ఈ భూమిపై నూకలు చెల్లిపోయాయి. ఎన్నో చోట్ల మారణహోమాల్ని సృష్టించి, వేలాదిమంది ప్రాణాలు తీసిన బిన్ లాడెన్ అమెరికన్ తుపాకులకు బలయ్యాడు. ఇస్లామిక్ తీవ్రవాదంపై ఎడతెరపని పోరాటం చేస్తున్న అమెరికా, ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. లాడెన్‌ను పట్టుకోవడం కోసం మొదలుపెట్టిన పోరాటంలో పదేళ్ల తర్వాత అనూహ్య ఫలితాన్ని అందుకొంది. ప్రపంచంలోని కలుగులన్నీ గాలించి... దేశదేశాల్లో పెను విధ్వంసాలు సృష్టించిన అగ్రరాజ్యం చివరకు, పాకిస్తాన్లో దాక్కొన్న లాడెన్‌ను చంపేసింది.
లాడెన్‌ను పట్టుకోవడం కోసం నిర్విరామంగా పోరాడుతున్న అమెరికా సంకీర్ణ బలగాలు.. అత్యంత వ్యూహాత్మకంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. అల్‌ఖైదా అధినేత కదలికలను చాలాకాలంగా వెంటాడుతున్న బలగాలు.. ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. లాడెన్‌తో పాటు మరికొంతమంది అల్‌ఖైదా నేతలనూ హతమార్చాయి.
ఆపరేషన్ సక్సెస్ అవడంతో, లాడెన్‌ను అంతం చేశామన్న ప్రకటనను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా ప్రకటించారు. ప్రపంచం నలుమూలల నుంచీ నిరసనలు వెల్లువెత్తుతున్నా, వెన్నుతిప్పకుండా చేసిన పోరాటం ఫలించిందన్న గర్వం ఒబామా మాటల్లో తొణికిసలాడింది. అల్‌ఖైదా చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, లాడెన్ మరణంతో న్యాయం జరిగిందని ఒబామా స్పష్టం చేశారు.
లాడెన్‌ను అమెరికా సంకీర్ణ సేనలు చంపాయన్న వార్త తెలియడం ఆలస్యం.. అమెరికాలో సంబరాలు మొదలయ్యాయి. వేలాది మంది అమెరికన్లు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. వైట్‌హౌస్ ముందు గుమిగూడారు. అల్‌ఖైదా అగ్రనేత హతమయ్యాడన్న వార్త ప్రపంచవ్యాప్తంగా కలకలం కలిగించింది.
అయితే.. లాడెన్ మరణంతో.. తీవ్రవాదం అంతమవుతుందా..? లాడెన్‌ను చంపడంతోనే అమెరికా పోరాటం ఆగిపోతుందా? ఇవే ఇప్పుడు అందరికీ కలవరపెడుతున్న ప్రశ్నలు.
పదేళ్ల పోరాటం
లాడెన్ ఆచూకీ కోసం అమెరికా గాలించని ప్రాంతం లేదు. ఆఫ్గాన్ కొండల నుంచి ఇరాక్ ఎడారుల దాకా ప్రతీ ప్రాంతాన్ని ఈ పదేళ్లలో జల్లెడ పట్టింది. ఆఫ్గన్, ఇరాక్లను మృత్యుకూపాలుగా మార్చేసింది. భారీబలగాలతో దాడులు చేసి ప్రభుత్వాలను కూల్చేసింది. వేలాదిమందిని హతమార్చింది. అయినా.. అమెరికాకు ఆశించిన ఫలితం దక్కలేదు. ఎంతోమంది టెర్రరిస్టులను చంపినా, మోస్ట్‌వాంటెండ్ ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ చిక్కలేదు. కొండను తవ్వి ఎలుకను పట్టిందన్న అపనిందనూ అమెరికా మోసింది.
ఆఫ్ఘనిస్తాన్లోనూ, ఇరాక్‌లోనూ లాడెన్ లేడన్న విషయాన్ని స్పష్టం చేసుకున్న అమెరికా, పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులపై కన్నేసింది. అక్కడ ఉన్న కొండగుహల్లోనే అల్‌ఖైదా టాప్‌లీడర్ నక్కి ఉండొచ్చని అనుమానించింది. రెండేళ్లుగా ఆ ప్రాంతంపై వరసగా దాడులు చేస్తూనే ఉంది. లాడెన్ ఆచూకీ చెప్పిన వారికి 25 మిలియన్ డాలర్లు ఇస్తామని ఆశకూడా చూపెట్టింది. అయినా.. లాడెన్‌కు సంబంధించి చిన్న ఆధారం కూడా దొరకలేదు.
లాడెన్‌ను హతమార్చితేనే .. వరల్డ్‌ట్రేడ్ సెంటర్స్‌పై దాడికి ప్రతీకారం తీర్చుకున్నట్లవుతుందన్నది అమెరికన్ల నమ్మకం. ఆ విషయం అమెరికా పాలకులకూ తెలుసు. అందుకే, ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా .. ఒక్క మనిషి పట్టుకోవడానికి భారీస్థాయిలో ఖర్చుపెట్టింది. సైనికుల ప్రాణాలనూ పణంగా పెట్టింది. పాకిస్తాన్‌లోనే లాడెన్ ఉండొచ్చన్న అనుమానాలను వ్యక్తం చేసినా, దానికి అక్కడి ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో అమెరికా ఆలోచనల్లో పడింది. పాకిస్తాన్‌కు తెలియకుండా రహస్య ఆపరేషన్‌ను మొదలుపెట్టింది.
లాడెన్‌కు అత్యంత నమ్మకస్తుడైన ఓ కొరియర్‌ను నాలుగేళ్ల క్రితం కనిపెట్టిన ఎఫ్‌బీఐ, అతన్ని నీడలా వెంటాడడం మొదలుపెట్టింది. లాడెన్ ఉండే అవకాశాలున్న ప్రాంతాన్ని రెండేళ్ల క్రితమే కనిపెట్టింది. పాకిస్తాన్‌లోని అబాట్టాబాద్లో లాడెన్ నివసిస్తున్న ఇంటిని గత ఏడాది ఆగస్టులో గుర్తించింది. అప్పటినుంచి అవకాశం కోసం ఎదురుచూస్తోంది. లాడెన్ కదలికలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అమెరికా అధ్యక్షుడు ఒబామాకు అందుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 29న లాడెన్‌ను చంపేయమంటూ వైట్‌హౌస్ నుంచి ఉత్తర్వులను జారీ అయ్యాయి. మే 1న ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు అమెరికా కమాండోలు.
ఇస్లామాబాద్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న అబాట్టాబాద్లో శత్రుదుర్భేద్యమైన నివాసంలో ఇంతకాలం దాక్కొన్నాడు లాడెన్. ఈ ఇంటి గోడలు ఒక్కోటి 4 నుంచి 6 మీటర్ల పొడవున్నాయి. పక్కనే ఉన్న భవనంతో పోల్చితే ఇది 8 రెట్లు పెద్దది. ఇంత పెద్దింటికి టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం చూస్తుంటే.. తమ గుట్టు ఎవరికీ తెలియకూడదనే లాడెన్ జాగ్రత్త పడ్డట్లు కనిపిస్తుంది. కానీ, అమెరికా నిఘా వర్గాలు మాత్రం.. లాడెన్ వాసనను పసిగట్టాయి. హెలికాప్టర్ల ద్వారా వచ్చి ఇంటిలోపలికి చేరుకున్న అమెరికన్ నేవీసీల్స్ అటాక్ చేశాయి. ఫైరింగ్ చేస్తూ లాడెన్‌ను లొంగిపోమంటూ హెచ్చరించాయి. కానీ, లాడెన్కూడా భద్రతాదళాలను ప్రతిఘటించాడు. స్వయంగా కాల్పులు జరిపాడు. పరస్పర కాల్పుల్లో తూటాలు లాడెన్ తలలోకి చొచ్చుకుపోయాయి. ఒసామాతో పాటు మరో ముగ్గురు చనిపోయారు. వీరిలో ఒకరు లాడెన్ కొడుకు కావచ్చని అనుమానం. ప్రపంచాన్ని వణికించిన తీవ్రవాది.. చివరకు అత్యంత ఘోరంగా హతమయ్యాడు.
ఒబామాను పెంచింది ఎవరు?
అమెరికా సహా చాలా దేశాలకు లాడెన్ అతిపెద్ద తీవ్రవాది కావచ్చు. క్రూరమైన హంతకుడు కావచ్చు. వేలాది మందిని పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షసుడిగా కనిపించవచ్చు. కానీ, అరబ్ దేశాల్లోని చాలామందికి మాత్రం అతనో హీరో.
సౌదీ అరేబియాలోని సుసంపన్నమైన కుటుంబంలో పుట్టాడు ఒసామా బిన్ లాడెన్. జెడ్డాలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఛాందసవాదం లాడెన్‌లో పెరిగిపోయింది. ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ యూనియన్ దాడి చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన లాడెన్, యుద్ధరగంలోకి ప్రవేశించాడు. అతి తక్కువ సమయంలోనే కమాండర్‌గా ఎదిగాడు. అతనికున్న ఆస్తిపాస్తులూ ముజాహిదీన్లను ఆకర్షించాయి. లీడర్‌ను చేశాయి. ఆప్ఘన్ విజయంతో సౌదీలోనూ లాడెన్‌కు ప్రజాకర్షణ పెరిగింది. తరచూ ప్రసంగాలు చేయడానికి ఆహ్వానాలు అందేవి. ఇదే సమయంలో సోవియెట్‌పై లాడెన్కున్న ద్వేషం కాస్తా అమెరికాపైకి మారింది. అమెరికన్ వస్తువులను కొంటే పాలస్తీనీయులను ఊచకోత కోసిన వారికి మద్దతిచ్చినట్లే అని ఓ సారి బహిరంగంగానే ప్రకటించాడు. అప్పటి నుంచి అమెరికా వ్యతిరేక కార్యకలాపాలు మొదలుపెట్టాడు.1990లో కువైట్‌ను ఆక్రమించిన ఇరాక్ సేనలను తరిమికొట్టడానికి అమెరికన్ సైన్యం అడుగుపెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇస్లాం పుట్టిన గడ్డపై ఇస్లామేతర సైన్యం రావడమేమిటంటూ నిరసించాడు. దీన్ని అడ్డుకోవాలని సౌదీ సర్కార్‌కు చేసిన విన్నపాన్ని పాలకులు పట్టించుకోలేదు. లాడెన్ విమర్శలు ఎక్కువవడంతో దేశబహిష్కరణ వేటు పడింది. దీంతో సూడాన్‌కు చేరుకున్నాడు. అక్కడ నుంచి తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘన్‌కు మకాం మార్చాడు. ఆఫ్ఘన్‌కు వచ్చిన తర్వాత అల్‌ఖైదాను ప్రారంభించి, అమెరికాపై పోరాటం మొదలుపెట్టాడు. 1998లో కెన్యా, టాంజీనియాల్లోని అమెరికన్ ఎంబసీల దగ్గర ఒకేరోజు పేలుళ్లకు అల్‌ఖైదా పాల్పడింది. సెప్టెంబర్ 11, 2001న అమెరికాలోని ట్విన్‌టవర్స్‌ను కూల్చివేసి 3000 మంది మరణానికి కారణం అయ్యాడు. అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద దాడి. అప్పటి నుంచి లాడెన్‌ను వెతకడానికి అమెరికా తీవ్రంగా శ్రమించింది. పదేళ్ల తర్వాత ప్రాణం తీయగలిగింది.
అల్‌ఖైదా ఏమవుతుంది?
ఇప్పుడు లాడెన్లేడు. మరి, లాడెన్ సృష్టించిన అల్‌ఖైదా ఏమవుతుంది? వాస్తవంగా చెప్పాలంటే.. ప్రపంచంలోని తీవ్రవాదసంస్థలన్నింటికీ మాతృసంస్థ అల్‌ఖైదానే అని చెప్పొచ్చు. చిన్న చిన్న గ్రూపులకు ఆయుధాలను, టెక్నాలజీని, నిధులను అందిస్తోంది అల్‌ఖైదానే. లాడెన్పేరుతో వచ్చే విరాళాలే ప్రధాన ఆదాయవనరు. లాడెన్ చనిపోవడంతో జిహాద్ ఉద్యమాన్ని ముందుకు నడిపించేదెవరన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆర్థికంగా ఈ సంస్థలన్నీ ఇబ్బందులు పాలుకాక తప్పవు. కార్యకలాపాలూ కొద్దిగా మందగించవచ్చు. కానీ, అల్‌ఖైదా కేవలం ఒక్కదేశానికే పరిమితం కాలేదు. అరబ్‌తో పాటు ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనూ విస్తరించింది. లాడెన్‌ను చంపినందుకు నిరసనగా టెర్రరిస్టులు దాడులకు తెగబడవచ్చు. ప్రస్తుతం లాడెన్‌ను చంపేశారన్న సెంటిమెంట్, అల్‌ఖైదాకు బలాన్నిచ్చినా, కొంతకాలం తర్వాత మాత్రం అదే మైనస్‌గా మారుతుంది.
ఇక అల్‌ఖైదాకు నేతృత్వం వహించేది ఎవరు? అల్‌ఖైదాలో నెంబర్ టు గా కొనసాగుతున్న అల్ జవహిరీనా? లిబియాలో పనిచేస్తున్న అబు యహా అలీ లిబీనా? పాకిస్తాన్ మిలిటెంట్ ఇలియాస్ కాశ్మీరీనా? ఈ ముగ్గురిలో ఎవరి ప్రత్యేకత వారిదే అయినా, లాడెన్‌కు ఎవరూ సరితూగలేరు. ఎన్నో విబేధాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నవారందిరినీ ఏకతాటిపైకి తెచ్చి, అమెరికాకు వ్యతిరేకంగా నడిపించడంలో లాడెన్ సక్సెస్ అయ్యాడు. అల్‌ఖైదా మనుగడ కూడా దీనిపైనే ఆధారపడి ఉంది. కానీ, కొత్త నేత ఆ స్థాయిలో పనిచేస్తాడన్న నమ్మకం లేదు. దీనికి తోడు బిన్ లాడెన్ అన్న పేరే అల్‌ఖైదాకు మహాబలం. లాడెనే పోయాడు కాబట్టి.. ఈ ఉగ్రవాద సంస్థ క్రమంగా నీరసించిపోవచ్చు. ప్రస్తుతానికైతే అల్‌ఖైదా పగ్గాలు అల్ జవహిరికీ అందే అవకాశాలున్నాయి.
లాడెన్‌ను చంపేశామని అమెరికా, ఇతర దేశాలు ఇక సంబరాల్లోనే మునిగిపోయి, తీవ్రవాద వ్యతిరేక పోరాటాన్ని పక్కన పెడితే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. అల్‌ఖైదా కచ్చితంగా ప్రతీకార దాడులకు తెగబడుతుంది. మరింతగా మారణహోమాన్ని సృష్టిస్తుంది. ఈ సమయంలోనే భద్రతా దళాలు సమర్థవంతంగా పనిచేయాలి. లాడెన్ లోటును అనుకూలంగా మలచుకొని తీవ్రవాదాన్ని తుదముట్టించాలి.
పాకిస్తాన్ దొంగాట
లాడెన్ చచ్చాడు.. చస్తూ చస్తూ ఓ సత్యాన్ని బయటపెట్టాడు. పాకిస్తాన్‌కు తీవ్రవాదులంటే ఎంత ఇష్టమో.. వారిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అందరికీ అర్థమయ్యేలా చేశాడు.
లాడెన్ దొరికింది ఆప్ఘన్లోని తోరాబోరా గుహల్లో కాదు.. పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని కొండల్లో కాదు. కనీసం అల్‌ఖైదాకు పట్టున్న ట్రైబల్ ఏరియాలోనూ కాదు.. లక్షమందికి పైగా నివాసం ఉంటే ఓ పట్టణంలో. అదీ పాకిస్తాన్ రాజధానికి సమీపంలో. వరల్డ్మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. పాక్ రాజధానికి సమీపంలో ఎలా ఆశ్రయం పొందాడు..? లాడెన్ అంత దర్జగా దేశంలోకి ప్రవేశించినా, పాక్ నిఘా వర్గాలు ఎందుకు కనిపెట్టలేకపోయాయి.? పాకిస్తాన్‌లోనే లాడెన్ ఆశ్రయం పొందడంపై అక్కడి ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తుంది?
పదేళ్ల క్రితం అమెరికాలో వరల్డ్‌ట్రేడ్ సెంటర్స్ కూల్చిన తర్వాత లాడెన్‌ను టార్గెట్ చేసుకుంది అమెరికా. బుష్ నేతృత్వంలోని అమెరికన్ బలగాలు లాడెన్ ఆశ్రయం పొందుతున్న అప్ఘనిస్తాన్‌పై దాడి మొదలుపెట్టాయి. యుద్ధం ముగిసినా లాడెన్ చిక్కలేదు. అప్ఘన్-పాక్ సరిహద్దుల్లోని నార్త్ వజిరిస్తాన్ కొండల్లో ఉండొచ్చని అమెరికా అనుమానించింది. ఆ ప్రాంతంపైనా దాడులూ చేసింది. కానీ దాడులు జరగడానికి ముందే లాడెన్ అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిపోయాడు. ఇలా లాడెన్‌ను తప్పించింది ఎవరో కాదు.. పాకిస్తాన్ ఆర్మీ, నిఘా సంస్థ ఐఎస్ఐ.
ప్రస్తుతం లాడెన్ ఉన్న ఇల్లు కూడా ఎన్నో అనుమానాలను కలిగిస్తోంది. అబాట్టాబాద్లోని ఈ మహాకట్టడం.. పాకిస్తాన్ మిలటరీ ట్రైనింగ్ బేస్‌కు సమీపంలోనే ఉంది. పైగా, ఇది పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం వందకిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ప్రాంతంలో రెస్ట్ తీసుకుంటున్నాడంటే, లాడెన్‌కు అందిన సహాయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పాక్ పాలకులకు, సైన్యానికి, నిఘా వర్గాలకు తెలియకుండా, లాడెన్ అక్కడ ఉండడం ఏమాత్రం సాధ్యం కాదు. అందుకే.. లాడెన్‌కు ఆశ్రయం ఇవ్వడంలో ప్రధాన పాత్ర పాకిస్తాన్ ప్రభుత్వానిదే.
లాడెన్ దాక్కున్న నివాసాన్ని 2005లో ఐఎస్ఐ నిర్మించినట్లు సమాచారం. లాడెన్ గుట్టు ఎవరికీ తెలియకుండా ఉండేలా, అవసరమైతే కాపాడేలా ఈ నిర్మాణం సాగింది. లాడెన్ విషయంలో పాకిస్తాన్ దాగుడుమూతలు ఆడుతుందన్న విషయాన్ని గుర్తించిన అమెరికా రహస్యంగా ఈ ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. లాడెన్ ఆచూకీ తెలిసిందన్న విషయాన్ని పాకిస్తాన్‌కు కూడా చెప్పలేదు. అనూహ్యంగా దాడికి దిగింది. లాడెన్‌ను మట్టుబెట్టింది.
లాడెన్‌ను ఇంత సేఫ్‌గా చూసుకోవాల్సిన అవసరం పాకిస్తాన్‌కు ఎందుకొచ్చింది? టెర్రరిస్టుల చేతుల్లో పాక్ ప్రభుత్వం పావుగా మారిందా? ఈ విషయంలో పాకిస్తాన్ పాలకుల ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తాయి. లాడెన్, అల్‌ఖైదాలు పాకిస్తాన్‌కు కాసులు కురిపించే అస్త్రాలు. ఈ రెండూ ఎంతకాలం ఉంటే అంతకాలం అమెరికా నుంచి భారీగా నిధులు, అత్యాధునిక ఆయుధాలు అందుతాయి. వీటిని దారి మళ్లించి సంపాదించుకునే అవకాశం పాలకులకు ఉంటుంది. అందుకే, లాడెన్‌ను అమెరికాకు చిక్కకుండా దాచిపెట్టింది. లాడెన్ అండతో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. మరింతగా సంపాదించుకొంటోంది. మన దేశంలోకీ టెర్రరిస్టులను పంపిస్తూ, అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఒకవేళ లాడెన్ ఆచూకీకి సంబంధించిన సమాచారం పాకిస్తాన్‌కు అంది ఉంటే, ఈ సారి కూడా అతను తప్పించుకుని ఉండేవాడు. మరో సేఫ్‌జోన్‌ను అతనికి పాక్ చూసిపెట్టేది. ముంబై మారణహోమానికి పాల్పడ్డ టెర్రరిస్టులూ ఇలానే పాక్‌లో ఆశ్రయం పొందుతున్నారు. లాడెన్ విషయంతోనైనా అమెరికా కళ్లు తెరిచి పాక్‌ను కట్టడి చేస్తేనే.. టెర్రరిస్టులకు కళ్లెం వేయగలుగుతాం. లేదంటే, మరో లాడెన్ తయారవుతాడు. మరెన్నో అల్‌ఖైదాలు పుట్టుకొస్తాయి.
అంతేకాదు.. భారత్‌ను అస్థిరపరిచే ప్రతీ ఒక్కరికీ పాకిస్తాన్ అండగా ఉంటుంది. బొంబాయి పేలుళ్లలో ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం దాక్కుంది పాకిస్తాన్‌లోనే. అక్కడ ఉన్నట్లు ఆధారాలను చూపించినా, దావూద్ ఎవరో తెలియదంటుంది పాకిస్తాన్. మన దేశంలో విధ్వంసాలకు తెగబడే తీవ్రవాదులకూ ఆశ్రయం కల్పిస్తోంది. చెప్పాలంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద తీవ్రవాద దేశం పాకిస్తాన్. అందుకే, పాక్‌పై కఠిన నియంత్రణలు అమలు చేయాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నమస్కారమండీ !
టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
మన తెలుగు బ్లాగ్లోకంలోని అన్ని బ్లాగులనీ ఒకేసారి చూసేందుకు వీలుగా, విన్నూత్నమైన సాంకేతిక సౌలభ్యాలతో కొత్తగా "
సంకలిని
" మీ ముందుకు తెచ్చాము.
ఈ సంకలినిలో ప్రత్యేకతలు
1.ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
2. హాస్యం, సాహిత్యం, సాంకేతికం రాజకీయ విభాగాలు ఒకే ఒక్క క్లిక్కుతో మీకు నచ్చిన ఏ విభాగానికైనా చేరుకునే సౌలభ్యం
ముందుమాట అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
ఒకసారి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలూ సూచనలు దయతలచ ప్రార్ధన. అలాగే మా ప్రయంతం మీకు నచ్చినట్లైతే ఇకనుండీ తెలుగు బ్లాగ్విహారానికై మా సంకలిని ఉపయోగించమని సవినయంగా మనవి.
ఇట్లు
సంకలిని బృందం