14, ఫిబ్రవరి 2011, సోమవారం
వాలెంటైన్ గిఫ్ట్ అందిందా..?
Categories :
ప్రేమ .. రెండక్షరాల పదమే కాని... ఆ రెండింటి మధ్య ఎవరికీ అంతుబట్టని అనుభూతి దాగి ఉంది. అందుకే, ఎన్నో శతాబ్దాలుగా.. ఈ ప్రపంచాన్ని ప్రేమ శాసిస్తూనే ఉంది. ఎంతోమందిని తన మాయలో పడేసింది. ఇప్పటికీ పడేస్తూనే ఉంది. అందుకే, దానికోసం ప్రత్యేకంగా ఓ రోజు సిద్ధమయ్యింది. కానీ, ఈ రోజే ఎంతోమందిలో విషాదం నింపుతోంది. ప్రేమపై విరక్తి పుట్టేలా చేస్తోంది.
ప్రేమలో పడితే అంతా కొత్తకొత్తగా ఉంటుంది. అప్పటిదాకా చూసిన ప్రపంచంలోనే తిరుగుతున్నా, అంతా వింతగా ఉంటుంది. మనసిచ్చిన ప్రేయసి కనిపిస్తే చాలు.. ఒంట్లో వెయ్యి ఓల్టుల ఎనర్జీ ప్రవహించడం మొదలవుతుంది. కళ్లు అటోమెటిక్‌గా ఆమెవైపు వెళ్లిపోతాయి. ఆమెనే చూస్తాయి. ఏ భావాలు లేని వారికీ.. ప్రేమలో పడగానే భావుకత పొంగుకొస్తుంది. మనసులోంచి కవితలు పొంగుకొస్తాయి. తన ప్రేమను వ్యక్తం చేయడానికి.. ఒక్కోసారి పదాలేకరువవుతాయి.
అమ్మాయిలను చూసీచూడగానే... లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ప్రేమలో మునిగిపోయేవాళ్లు ఎంతోమంది. ఒక్కసారి కమిట్ అయ్యారంటే.. వారికి తన ప్రేయసే ప్రపంచం. ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా.. ఆలోచలన్నీ ఆమెవే. ఎవరిని చూసినా.. ఆమె గుర్తొస్తుంది. రెప్పవాల్చినా, రెప్ప తెరిచినా.. కళ్లముందు ప్రేయసి కనిపిస్తుంది. ప్రతీ క్షణం కవ్విస్తుంటుంది. ప్రేయసిని పొగడడం.. ప్రేమికుడి దినచర్యలో భాగం అయిపోతుంది. ప్రపంచంలోని అందగత్తెలందరూ.. తన ప్రేయసి ముందు దిగదిడుపుగానే కనిపిస్తారు. ఆ ఆందం ఆమెలో ఉండకపోవచ్చు.. కానీ, ఆ అబ్బాయి ప్రేమలో ఉంటుంది. అందుకనే.. ప్రేమలో పడేముందు వర్ణం,వర్గం ఏమీ గుర్తురావు. ఒకవేళ గుర్తొచ్చినా.. అవేమీ అడ్డుకావనిపిస్తుంది.
ప్రేమ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. కట్టుబాట్లు.. సంప్రదాయాలు.. ఇవేవీ ప్రేమికులకు పట్టవు. తమ చుట్టూ ఎంతో మంది ఉన్నారన్న విషయమే స్పురించదు. అందరూ ఉన్నా.. ఏకాంత ప్రపంచంలోనే తాము ఉన్నామనుకుంటారు. ఈ ప్రేమను ఎవరైనా కంట్రోల్ చేయాలనుకుంటే.. అతి ఉప్పెనగా మారుతుంది. అవసరమైతే అందరినీ ఎదిరించే తెగింపును ఇస్తుంది.
ఇదంతా రీల్లైఫ్లానే కనిపిస్తున్నప్పటికీ.. రియల్లైఫ్లోనూ ఇలాంటి స్టోరీలు ఎన్నో. వీటన్నింటికీ కీలకమైన మజిలీ.. వాలెంటైన్స్ డే. ప్రేమను చెప్పాలనుకునేవారికి ఇదో పండగరోజు. ఇక ఇప్పటికే లవ్‌లో మునిగితేలుతున్నవారికి.. ఈ రోజును స్వీట్మెమోరీగా మిగుల్చుకునే రోజు. కానీ, కొంతమందికి మాత్రం... ఇదో విషాద దినం. ఆ కొంతమంది ఎవరు..?
బహుమతి అందకపోతే..?
వాలెంటైన్స్ డే.. ఎన్నో ప్రేమలకు స్టార్టింగ్ పాయింట్. ఎవరో ఒకరిపై ఇష్టం పెంచుకుని, వారితో ఇంతకాలం చెప్పలేక.. మనసులో దాచుకోలేక.. ఇబ్బంది పడే ఎంతోమంది రిలీఫ్ అయ్యేది కూడా ఇవాళే. ఎందుకంటే.. వారి లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేసేలా చేస్తుంది వాలెంటైన్స్ డే. ఈ రోజు తమదే అన్న ఫీలింగ్ లవ్ చేసే ప్రతీ ఒక్కరిది. అందుకే.. చాలాప్రేమలు ప్రేమికుల రోజునే మొదలవుతాయి.
లవర్స్ కోసమే స్పెషల్‌గా ఓ రోజు వచ్చినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా..? అందుకే, ప్రేమికులంతా తమ తాహతుకు తగ్గట్లుగా సెలబ్రెట్ చేసుకున్నారు. ప్రేయసికి ఏది ఇవ్వాలా అని అబ్బాయి ఆలోచిస్తే... ప్రియుడిని ఎలా మెప్పించాలా అన్న ఆలోచన అమ్మాయిది. వాలెంటైన్స్ డేన ఇచ్చే గిఫ్ట్ అలాంటింది. దానికున్న విలువ అలాంటింది. ఇక కొత్తగా ఎవరికైనా వాలెంటైన్ గిఫ్ట్ అందిందంటే.. వారి లైఫ్ మారిపోతుంది. వారి జీవితంలో కొత్త వెలుగు ప్రసరిస్తుంది.
ఇలా వాలెంటైన్ గిఫ్ట్ కోసం ఎదురుచూసేవాళ్లు ఎంతోమంది. తాము ఎంతో ఆశలు పెంచుకున్నవాళ్లు.. తప్పక ఇస్తారన్న నమ్మకం వారిది. కానీ.. కొంతమంది ఆశలు అడియాశలు కాకతప్పదు. వాలైంటైన్ డేన గిఫ్ట్ అందదు. అంటే.. వారి లవ్ ఫెయిల్ అయ్యిందన్నమాట. ప్రేమ ఫెయిల్ అయితే.. ఒక్కసారిగా గుండె పగిలినట్లవుతుంది. అందరూ తమ లవర్స్‌తో ఎంజాయ్ చేస్తుంటే.. వీళ్లు మాత్రం ఒంటరిగా బాధపడాలి. పైగా, మీ లవర్ ఏం గిఫ్ట్ ఇచ్చిందని ఎవరైనా అడిగితే.. ఆ వేదన మరింత ఎక్కువవుతుంది. ప్రేమను మర్చిపోవడానికి, ఏవేవో చేస్తుంటారు. లవ్ ఫెయిల్ అయినందుకు రగిలిపోయేవారూ ఎంతోమంది ఉంటారు. అయితే.. వాలెంటైన్స్ డే రోజున గిఫ్ట్ రాకపోతే.. లవ్ ఫెయిలైనట్లేనా...? దానికి మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనా..? ప్రేమ లేదని.. ప్రేమించ రాదని అంటూ విషాదగీతాలు పాడుకోవాల్సిందేనా..?
వీడ్కోలు దినం
వాలెంటైన్స్ డే లవర్స్‌కు స్వీట్మెమెరీనే కాదు.. విచారదినంగా మిగిలిపోతోంది. ఎందుకంటే.. ఎంతోకాలంగా ప్రేమలో మునిగితేలిన జంటలు.. వాలెంటైన్స్‌డే రోజునే.. తమ లవ్షిప్ను బ్రేక్ చేసుకుంటున్నాయి. ఇక ఈ బంధం మాకు అవసరం లేదంటున్నాయి. ప్రేమికులరోజుకు గుర్తుగా.. కొత్త లైఫ్‌ను ప్రారంభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్కృతి ఇటీవలికాలంలో పెరగుతూ వస్తోంది. కాలేజ్ లైఫ్లోనో, టీనేజ్లోనే మొదలయ్యే ప్రేమలు ఇక కొనసాగించలేమనుకునేవారు.. వాలెంటైన్స్ డేను అందుకు వేదికగా మార్చుకుంటున్నారు. చివరిసారిగా తమ లవర్‌తో కలిసి గడిపి.. గుడ్‌బై చెప్పేస్తున్నారు. ప్రేమజంటల్లో దాదాపు 40 శాతం మంది ఫిబ్రవరి 14న విడిపోతున్నారని ఓ సర్వేలో తేలింది. అంతేకాదు.. ప్రేమించి, అందర్నీ ఎదిరించి పెళ్లిళ్లు చేసుకున్నవారిలోనూ చాలామంది.. వాలెంటైన్స్ డే రోజునే విడాకుల కోసం ట్రై చేస్తున్నారట. అదే రోజు తమకు విడాకులు అందేలా చూడాలంటూ లాయర్లనూ కోరుతున్నారు.
రొమాంటిక్‌గా జరుపుకోవాల్సిన ప్రేమికులరోజును ఇలా... బ్రేకప్స్‌తో విషాదంగా మార్చుకోవడం కాస్త వింతగానే ఉండొచ్చు. కానీ, వాస్తవంగా జరుగుతున్నది అదే. చాలామంది లవ్ కపుల్స్ మధ్య సంబంధాలు రకరకాల కారణాలతో విచ్ఛిన్నమవుతున్నాయి. అందులో ఆర్థికవిషయాలు ప్రధాన కారణం పోషిస్తున్నాయి. సరైన జాబ్ చేయకుండా జాలీగా తిరిగేవాళ్లను అమ్మాయిలు త్వరగానే వదిలించుకుంటున్నారు. ఇక వ్యక్తిగత ప్రవర్తన నచ్చక, అభిప్రాయాలు కలవక.. విడిపోతున్న జంటలూ ఉన్నాయి. బహుశా.. లవర్ నుంచి గిఫ్ట్ వస్తుందని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసి.. నిరాశపడ్డ వారిలో మీరూ ఉంటే ఏ మాత్రం ఫీలవకండి. అది మీ లవ్బ్రేక్కు మొదటి అడుగు అయి ఉండొచ్చు. మీలానే ఎంతోమంది.. ఈ రోజు విడిపోతుండవచ్చు.
లవ్ ఫెయిలైతే..?
లవ్ ఫెయిల్.. ఇప్పుడు కామన్ వర్డ్.. మీ ఫ్రెండ్స్‌లో ఎవరినైనా పలకరించి చూడండి.. వారి లవ్‌స్టోరీలు తెలుసుకోవడానికి ట్రై చేయండి.. ప్రతీ ఒక్కరి లైఫ్‌లోనూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కథలు చాలానే ఉంటాయి. వాలెంటైన్ డేన మీకు మీ లవర్ దూరం అయ్యిందని ఫీలవడం కన్నా.. అలాంటివి లవ్‌లో కామనే అని తెలుసుకోండి. ఎందుకంటే ఇది కమర్షియల్ వరల్డ్. రిలేషన్స్షిప్పై ఫీలింగ్స్‌తో పాటు, చాలా ఇష్యూలు ప్రభావం చూపిస్తుంటాయి. అవసరాన్ని బట్టి బంధాలను మార్చేస్తుంటాయి. సో.. లవ్ ఫెయిల్ అయిందని ఏ మాత్రం ఫీల్ కావద్దు.
చాలామంది లవ్ ఫెయిల్ అయితే.. జీవితం కోల్పోయామనుకుంటున్నారు. ఆ కోపంతోనే..దాడులకూ దిగుతున్నారు. ఎదుటి వారి ప్రాణాలనూ తీయడానికి ట్రై చేస్తున్నారు. హంతకులుగా మారుతున్నారు. మన రాష్ట్రంలో ఇలా ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు, తృటిలో తప్పించుకున్న అమ్మాయిలు ఎంతోమంది. మరి ఇదేనా ప్రేమంటే.. ? అంతవరకూ ఎంతో ప్రేమించి.. అప్పటికప్పుడు ప్రాణాలు తీయాలని ఎలా అనిపిస్తుంది..?
అసలు ప్రేమంటే ఏమిటి? ప్రేమలో పడ్డవారు ఎప్పుడైనా ఆలోచించారా..? లవర్‌ను ఎప్పుడూ చూడాలనిపించడం, వాళ్లతో వీలైనంత వరకూ గడపడం.. సరదా షికార్లకు వెళ్లడం.. అంతేనా...? అంతవరకే అయితే అది ప్రేమ కానే కాదు. జస్ట్ అట్రాక్షన్. అది వయస్సుకు సంబంధించింది మాత్రమే గానీ.. మనసుకు సంబంధించింది కాదు. మీరు మనసుతో ప్రేమించి ఉంటే.. మీరు ఎప్పుడూ అలా ప్రవర్తించరు.
ఇక ప్రేమలో గెలవలేదని మనోవేదనకు గురై.. ఎంతోమంది తమ జీవితాలను ముగిస్తుంటారు. అదీ కరెక్ట్ కాదు. ఎందుకంటే.. మనకు ప్రేమ దక్కలేదంటే.. అది ఎదుటివారి లోపం అనుకోవాలే తప్ప.. మన లోపం అనుకోకూడదు. ఒకరు కాకపోతే మరొకరు. ఈ ప్రపంచమేమీ చిన్నబోలేదు. మిమ్మల్ని అర్థం చేసుకునే మనిషి కోసం ఎదురు చూడండి.
ఇక ప్రేమించడానికి, లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి వాలెంటైన్స్ డే మాత్రమే ఉందనుకోకండి. మీలో ఎప్పుడు ఫీలింగ్ వస్తే అప్పుడే వాలెంటైన్ డే. మీకు నచ్చిన మనిషిని.. మిమ్మల్నీ మెచ్చితే ఆ రోజే ప్రేమికుల రోజవుతుంది. ఎక్కడినుంచో వచ్చి పడ్డ ఈ రోజును తలచుకుని ఏ మాత్రం బాధపడకండి. మీ వాలెంటైన్డేను మీరే సృష్టించుకోండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి